Wednesday, August 5, 2015

కొత్తపల్లి పత్రిక ముద్రిత ప్రతుల్ని ఇప్పుడు ఆన్‌లైనులో ఆర్డరు చేయచ్చు!

మిత్రులారా,

కొత్తపల్లి ముద్రిత ప్రతులను మీరు ఇప్పటికిప్పుడు ఆన్‌లైనులో ఆర్డరు చేసి తెప్పించుకోవచ్చు!  మీ బడులకు, దగ్గరలో ఉన్న గ్రంధాలయాలకు, ఇతరులకు ఎవ్వరికైనా కొత్తపల్లి ప్రతుల్ని అందించటం ఇప్పుడిక మరింత సులువు!
2013, 2014, 2015 లలో ప్రచురితమైన పుస్తక సంపుటాలను మీరిప్పుడు ఆన్‌లైనులో ఆర్డరు చేసి తెప్పించుకోండి.  విదేశాలలో ఉండే అభిమానులు భారతదేశంలో నివసించే బంధు మిత్రుల చిరునామాలివ్వండి!

సంపుటాలను ఆర్డరు చేసేందుకు సందర్శించండి:

http://instamojo.com/kottapalliకథల పుస్తకాలండీ కథల పుస్తకాలు!
పిల్లలు చెప్పిన కథలున్నాయ్  
పెద్దలు వ్రాసిన కథలున్నాయ్    
రంగురంగుల బొమ్మలున్నాయ్    
అక్కడక్కడా జోకులున్నాయ్    
కథల పుస్తకాలండీ కథల పుస్తకాలు!     
ఆన్ లైన్ లో దొరుకుతున్నాయ్       
ఇప్పుడే కొనండి     
అందరికీ చెప్పండి     
కథల పుస్తకాలండీ కథల పుస్తకాలు!    

ఇతర సంచికల కోసం, మరిన్ని వివరాల కోసం  మెయిల్లో  సంప్రతించండి:  team at kottapalli dot in
                                                     ఫోను ద్వారా :  7702877670 లేదా  9000453887

Wednesday, July 29, 2015

కొత్తపల్లికి RNI వారి గుర్తింపు!

మిత్రులారా!
మూడు నెలల విరామం తర్వాత కొత్తపల్లి ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నది. ఒకటవ తేదీకల్లా ఆగస్టు సంచికను ఇంటర్నెట్లో విడుదల చేయాలని కసరత్తు చేస్తుండగా,  అంతలోనే రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా (RNI) వారు కొత్తపల్లిని మాసపత్రికగా గుర్తిస్తూ పంపిన సర్టిఫికేటు అందింది.
కొత్తపల్లిని పత్రికగా గుర్తించమంటూ దరఖాస్తు చేసుకున్నది అసలు డిసెంబరు 2013లో. ఇన్నాళ్ళకు, జూన్ 2015 కు- నమోదు ప్రక్రియ పూర్తయింది.  ఏవేవో కారణాల రీత్యా ఆలస్యం అయినా, ఈ ప్రక్రియ చాలా పారదర్శకంగా, పూర్తిగా అవినీతి రహితంగా ఉండింది. దాన్ని అలా ఉంచిన ఆర్ యన్ ఐ వారికి అనేక ధన్యవాదాలు, అభినందనలు!


ఇప్పుడిక ఈ సర్టిఫికేటు ఆధారంగా పోస్టలు శాఖవారిని కలవచ్చు;  కొత్తపల్లిని తక్కువ ధరకు పోస్టు చేయచ్చు- ఖర్చులు కొంత కలిసి వస్తాయి బహుశ:.
కొత్తపల్లి వెబ్సైటులోగాని, ప్రింటు పత్రికలోగానీ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనలూ లేవు.  కొత్తపల్లి వెబ్సైటు ఆనంద్-లక్ష్మిల సహాయంతో‌ కొనసాగుతుంటే, ప్రింటు పత్రిక కేవలం మీ అందరూ అభిమానంతో ఇచ్చిన విరాళాల వల్లా, చందాదారులు సబ్సిడీ ధరకు కట్టిన చందాలవల్ల నడుస్తూ వచ్చింది ఇన్నాళ్ళుగా.  ఈ క్రమంలో అనేకమంది పిల్లలు-పెద్దలు ఇష్టంగా కథలు చదువుకున్నారు; కథలు రాశారు, బొమ్మలు వేశారు, సంతోష పడ్డారు. ఆ కథలు-బొమ్మలు అన్నీ‌   "ఎవరైనా చదువుకోండి- ఎవరైనా రాయండి- బాగా పంచుకోండి" అని పబ్లిక్ డొమైన్‌లో ఉంచబడ్డాయి. వెయ్యికి పైగా కథలు, అంతకు ఐదారు రెట్ల బొమ్మలు ఇలా 'జనాల సొత్తు' గా నిలిచాయి.
ప్రింటు పత్రిక ఖర్చు ఎక్కువ; అంతా పెట్టుబడితోటీ, డబ్బుతోటీ ముడిపడి ఉన్నది. ఆర్ యన్ ఐ వారి సర్టిఫికేటు నేపథ్యంలో,  ఇకపైన ప్రింటు పత్రికలో‌ మాత్రం చిన్నపాటి ప్రకటనలు వేస్తే ఖర్చులకు బాగుంటుందని మిత్రుల సూచన. ఈ‌ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
ప్రింటు పత్రిక పునాదిని పటిష్టం చేసేందుకు,  మరింతమంది పిల్లలకు దాన్ని చేర్చేందుకు ప్రభుత్వం వారిని- ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ వారిని, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలవాలని మరికొందరు మిత్రుల సూచన. ఇన్నాళ్ళూ ఆర్ యన్ ఐ వారి గుర్తింపు లేదనే సాకుతో ఎవ్వరినీ‌ కలవకుండా గడిపాం. ఇప్పుడిక అందరినీ కలవాలి.  

అన్నింటా మీ అందరి సలహాలు, సూచనలు ఆశిస్తూ-

నారాయణ.