Friday, November 19, 2010

ZP High School లో లైనక్సు మెషీన్లు!

కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం వారు బడులలో కంప్యూటర్ సెంటర్లను అట్టహాసంగా మొదలెట్టిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజుల్లో NIIT వాళ్ళు ప్రభుత్వం తరపున బడులలో కంప్యూటర్ సెంటర్లను నడిపించారు- పిల్లలకోసం వాళ్ళు ప్రత్యేకంగా 'కంప్యూటర్ పుస్తకాలు' (!) ముద్రించి పంచారు కూడాను. ఇక అప్పటినుండి ఎనిమిదో తరగతినుండి పిల్లలు మామూలు పరీక్షలకు అదనంగా 'కంప్యూటర్ పరీక్షలు' రాయాలని నిర్దేశించారు! :(

('ఆ కంప్యూటర్ సెంటర్లలో పిల్లలకు ఏమి నేర్పించారు, పిల్లల్ని పరీక్షలో ఏమి అడిగారు'- అని చూస్తే కొంచెం నవ్వూ, కొంచెం‌ ఏడుపూ వస్తాయి: పిల్లలకు వాళ్ళు "విండోస్ నేర్పారు" (అంటే మైక్రోసాఫ్టు వర్డు, ఎక్సెలు, పెయింటు వగైరాలన్నమాట!! )
పరీక్షలో‌అడిగే మాదిరి ప్రశ్న: " యం యస్ వర్డులో 'వ్యూ' మెనులో ఏమేమి ఉంటాయి?" -ఇలాంటివాటికి జవాబు నాకూ తెలీదు! :) )

అన్ని విండోస్ యంత్రాల లాగానే ఈ సెంటర్లలోని యంత్రాలు కూడా ఘోరమైన వైరసుల బారిన పడి కొన్ని, కాలక్రమంలో కొన్నీ మూలపడ్డాయి. మిగిలినవీ చాలా అసంతృప్తితో నత్తనడక నడుస్తున్నాయి.

ఈమధ్య కొత్తపల్లిని చూసేందుకు వచ్చిన స్థానిక జిల్లాపరిషత్ స్కూలు హెడ్మాస్టారు గారికి మేం లైనెక్సు యంత్రాల్లో ఆడుతూ పాడుతూ పనిచేసుకోవటం నచ్చింది. విండోస్ తో ఏమేం చెయ్యచ్చో అవన్నీ- నిజానికి వాటికంటే ఎక్కువ మంచి పనులు- ఉబుంటుతో చెయ్యచ్చని మేం ఆయనకు లైవ్ డెమో ఇచ్చాం. ఏవి కావాలంటే అవి- శృతిపెట్టె నుండి హోమియోపతి సాఫ్టువేరు వరకూ- చక్కటి సలహాలతో సహా- దొరికే వీలుంటుందని చూపేసరికి- ఆయన మొదట తన ఇంట్లో ఉన్న విండోస్ యంత్రాన్ని ఉబుంటు లైనెక్సు లోని మార్చేసుకున్నారు, ఆ తర్వాత బడిలో సమస్యగా ఉన్న ఒక యంత్రంలో ప్రయోగాత్మకంగా లైనెక్సు ఇన్స్టాలు చేయించుకున్నారు. And he is happy!!

బడిలో మూలన పడి ఉన్న ఎనిమిది యంత్రాలను లైనెక్సు ద్వారా త్వరలో మళ్ళీ బ్రతికించాలని మా ఆలోచన..అది గనక జరిగితే ఇక్కడి ప్రభుత్వ బడిలో పిల్లలకి విండోస్ కంటే మంచి ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాయని అర్థమౌతుంది, తప్పనిసరిగా. పెద్దలకూ అర్థమవ్వచ్చు.. ఆపైన వాళ్ళు మైక్రోసాఫ్టును వదిలెయ్యచ్చు, పూర్తిగా!!! అటుపైన పిల్లల్ని ఎవ్వరూ యం యస్ వర్డు ప్రశ్నలు అడగరు!!! ప్రపంచం ఎంత అందంగా ఉంటుందప్పుడు!!

2 comments:

  1. తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. కూడలిలో చేర్చారా?
    విషయం బావుంది.
    :) పెట్టి ఊరుకుంటాను.
    నేను వాడేది పూర్తిగా సుతిమెత్తని (microsoft) మృదుసామగ్రి (software కి http://andhrabharati.com/dictionary/ ichchina padam) కనుక.

    ReplyDelete
  2. ఇంకా లేదండీ, చేరుస్తాం, త్వరలో.

    ReplyDelete